కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికలో (DK ARUNA SPEAKS ON HUZURABAD BY ELECTIONS) తెరాస నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయతీగా పోరాడిన ఈటల రాజేందర్పైనా... తెరాస నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు..
సంతలో కూరగాయలు కొంటునట్లు ఇతర పార్టీల నేతలను.. తెరాస నాయకులు కొనుగోలు (DK ARUNA ALLEGATIONS ON TRS LEADERS)చేస్తున్నారని.. ఈ చర్యలతో తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో గులాబీపార్టీ నేతలు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈటల కోసం పనిచేస్తున్న కార్యకర్తలపైనా దాడులు చేస్తున్నారని ఆరోపించిన భాజపా నేత.. ఇకపై వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ అంతా ఈటల వెంటే..
భారతీయ జనతా పార్టీ మొత్తం ఈటల వెంట ఉన్నారన్న విషయం తెరాస నేతలు మరవద్దని డీకే అరుణ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో పోలీసులు వ్యవహారశైలి.. తెలంగాణ ప్రజలు తలదించుకొనేలా ఉందని ఆమె ఆరోపించారు. వారు ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని అరుణ హితవు పలికారు.
ప్రజలూ కోరుకుంటున్నారు..
కేవలం భాజపా నేతలే కాకుండా.. యావత్ తెలంగాణ ప్రజలు ఈటల విజయం సాధించాలని కోరుకుంటున్నారని.. డీకే అరుణ తెలిపారు. అందుకోసమే అందరూ స్వచ్ఛందంగా హుజూరాబాద్ వచ్చి ఈటల గెలుపు కోసం కృషి చేస్తున్నారని డీకే అరుణ వివరించారు.
హుజూరాబాద్ బరిలో నిలిచింది వీరే..
హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార తెరాస తరఫున గెల్లు శ్రీనివాస్‌యాదవ్, భాజపా నుంచి మాజీమంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలుస్తున్నారు. ఈనెల 30 ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ వేసిన 61 మందిలో 42 మంది నామపత్రాలు మాత్రం సక్రమంగా ఉండగా.. వారిలో 12 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఉపఎన్నిక బరిలో 30 మంది మిగిలారు. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించనున్నారు. ఇప్పటికే వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కొన్నింటిని ఎంపిక చేసుకోగా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను బట్టి వారికి వాటిని కేటాయించనున్నారు.
ఇదీచూడండి: Huzurabad by election:నామినేషన్ ఉపసంహరణకు ముగిసిన గడువు.. బరిలో ఎందరో తెలుసా!