హుజూరాబాద్‌లో(Huzurabad by election news) ప్రైవేటు వాహనంలో వీవీ ప్యాట్ తరలింపు ఆందోళనకు దారితీసింది. పోలింగ్(Huzurabad by election news) ముగిశాక.... భారీభద్రత మధ్య తరలించాల్సిన వీవీ ప్యాట్ని ఓ వ్యక్తి ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్లడం చర్చనీయంగా మారింది. ప్రభుత్వ వాహనంలో తరలించాల్సిన దీనిని రాత్రివేళ ప్రైవేటు వాహనంలో ఎలా తరలిస్తారంటూ.... భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.
అడ్డుకున్న పార్టీ శ్రేణులు
నేతల మాటల యుద్ధం, డబ్బు పంపిణీ ఆరోపణల మధ్య హోరెత్తిన హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election news) శనివారం సాయంత్రం 7గంటలకు ముగిసింది. రాత్రి జమ్మికుంట వద్ద నుంచి ప్రైవేటు వాహనంలో వీవీ ప్యాట్ తరలిస్తుండగా... గుర్తించిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అడ్డుకున్నారు. వీవీ ప్యాట్ని ఆర్టీసీ బస్సులో కాకుండా వేరే వాహనంలో తీసుకెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.... కార్యకర్తలతో కలిసి వాహనాన్ని అడ్డుకున్నారు. బస్సు టైరు పంక్చర్ కావడం వల్ల యంత్రాన్ని కారులో తరలిస్తున్నట్లు సదరు వ్యక్తి చెబుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను కాంగ్రెస్, భాజపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. కాగా... వీవీ ప్యాట్ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రిటర్నింగ్ అధికారి ప్రకటన
వీవీ ప్యాట్ తరలింపుపై రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. పనిచేయని వీవీ ప్యాట్‌ను తరలిస్తుండగా వీడియో తీశారన్న రిటర్నింగ్ అధికారి... మరో వాహనంలోకి తరలిస్తుండగా రికార్డు చేశారని స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రకటించారు.
ఉద్రిక్తలు
పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెరాస, భాజపా శ్రేణుల వాగ్వాదాలతో ఉద్రిక్తతలు తలెత్తాయి. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో నాయకులు, కార్యకర్తలు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. భాజపా నాయకురాలు, కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమ వాహనాన్ని తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. స్థానికురాలు కాని ఆమె ఎందుకొచ్చారని వాహనంపై దాడికి ప్రయత్నించాయి. భాజపా నాయకులు ప్రతిఘటించారు. పోలీసుల చొరవతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే మండలంలోని గన్ముకుల పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని భాజపా నాయకులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. వెళ్లిపోయేవరకు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి వచ్చిన తెరాస నాయకుడు, గజ్వేల్ ఏఎంసీ ఛైర్‌పర్సన్ భర్త మాదాసు శ్రీనివాస్ వాహనాన్ని స్థానిక భాజపా నాయకులు అడ్డుకొని పంపించారు. వీణవంక మండలం కోర్కల్‌లో తెరాస నాయకులు బూత్‌లో ప్రచారం చేస్తున్నారని భాజపా నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా పోలింగ్ ఉదయం మందకొడిగా సాగగా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఎక్కువగా కదలివచ్చారు. కమలాపూర్ మండలం బీంపల్లిలో కొవిడ్ సోకిన ఒక మహిళ పీపీఈ కిట్ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీ పోరులో ఈవీఎంలలో ఓటర్లు తమ తీర్పుని నిక్షిప్తం చేశారు. ఎవరికి వారే పార్టీ శ్రేణుల ఎదుట విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్ నమోదవగా ఈ సారి అది 86.57 శాతంగా ఉంది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది.
ఇదీ చదవండి: HUZURABAD: హు‘జోరు’ పోలింగ్.. ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు