భూసార పరీక్షలు చేయకుండా సన్నరకం ధాన్యం పండించాలంటూ సీఎం ఆదేశాలివ్వడం వల్లే రైతులు నష్టపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. భూసార పరీక్షలు నిర్వహించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు రూ.125 కోట్లు మంజూరు చేస్తే.. ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో తెలియడం లేదని సంజయ్ దుయ్యబట్టారు. పర్యవసానాలు ఆలోచించకుండా తన మాటను నమ్ముతారో లేదో తెలుసుకునేందుకు మాత్రమే సీఎం కేసీఆర్ రైతులకు సన్నరకం ధాన్యం పండించాలని కోరినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌజ్‌లో దొడ్డురకం ధాన్యం పండించి.. రైతులను మాత్రం సన్నరకం అంటూ నట్టేట ముంచారని ఆక్షేపించారు. ఈ సందర్భంగా సన్న రకం ధాన్యం క్వింటాలుకు రూ.2500 చెల్లించాలని, రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నట్లు సంజయ్ వివరించారు.
ఇదీ చూడండి: 'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'