Bandi Sanjay response to Karnataka election results : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంక్ చెక్కుచెదరలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మతతత్వ రాజకీయాలు చేసి అన్ని పార్టీలు ఏకమై.. అధికారం చేజిక్కించుకున్నాయని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల్లోనైనా అక్కడి స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుందని.. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదని తెలిపారు.
గత ఎన్నికల్లో 36 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో 104 సీట్లు వస్తే.. ఇప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గకుండా 36 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ 38 నుంచి 43 శాతానికి పెరిగిందని.. జేడీఎస్ ఓటింగ్ షేర్ 20శాతం నుంచి 13 శాతంకు తగ్గిందని తెలిపారు.
జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం నేరుగా కాంగ్రెస్‌కు ఓటేయ్యలని ప్రజలకు పిలుపునిచ్చాడని.. ఎన్డీపీఐ, ఎంఐఎం పార్టీలు కూడా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశాయన్నారు. అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయం చేసి బీజేపీని ఎదుర్కొన్నాయన్నారు. ఒక వర్గం ఓట్లతో అధికారం హస్తగతం చేసుకున్నాయన్నారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామంటూ.. మతతత్వ రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టేనని ధ్వజమెత్తారు.
కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి పెద్దన్న పాత్ర పోషించాడన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌కు కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. కర్ణాటక క్యాంప్ రాజకీయాలు సీఎం కేసీఆర్ అండతోనే.. హైదరాబాద్‌లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్‌కు తెలియకుండా హైదరాబాద్‌లో క్యాంప్ రాజకీయాలు నడుస్తాయా అని ప్రశ్నించారు.
జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు బలం పెరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించామని.. తెలంగాణలోనూ బీజేపీ ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపేనని.. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్ సహా, భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని తెలంగాణలో చెప్పగలరా? అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’’ అని బండి సంజయ్ అన్నారు.
ఇవీ చదవండి:
- కొంపముంచిన 'అవినీతి'.. కాపాడని హిందుత్వం.. బీజేపీ ఓటమికి కారణాలివే!
- Karnataka Assembly Election Results : కర్ణాటకలో ఎవరికెన్ని సీట్లు వచ్చాయంటే..
- KTR Tweet On Karnataka Result : 'తెలంగాణలో బీఆర్ఎస్ ఉండగా.. కర్ణాటక ఫలితాలు రిపీట్ కావు'
- Revanth Reddy on Karnataka Results : 'నిన్న హిమాచల్.. నేడు కర్ణాటక.. రేపు తెలంగాణ'