Bandi Sanjay Reacts on Medigadda Barrage Incident : కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ.. నాణ్యత ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) ప్రమాదంలో పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జమ్మిపూజ చేసిన బండి సంజయ్.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు.
Medigadda Barrage Bridge Sagged Incident : మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) బాధ్యత వహించాలని.. బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటించనందు వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. నిర్మాణ సమయంలో.. ఇతర రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కిషన్ రెడ్డి.. కేంద్రానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"
కేంద్ర సర్కార్ సైతం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. డ్యామ్ భద్రతపై నిపుణులతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడమే మంచిదయ్యిందన్నారు. కేసీఆర్, వారికి చెందిన కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో కమీషన్లను దండుకున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ ప్రమాదంపై సీఎం కేసీఆర్.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని.. కల్వకుంట్ల కుటుంబం నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేయాల్సి ఉందన్నారు.
Bandi Sanjay fires on KTR : వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అధికారం ఉందనే అహకారంతో ప్రవర్తిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇంజినీరింగ్ అద్భుతంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరగడంతో.. మొన్న మోటార్లు మునిగిపోయాయని, నిన్న ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు.
"మేడిగడ్డ బ్యారేజీ ఘటనకు ముఖ్యమంత్రి కుటుంబమే బాధ్యత వహించాలి. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ.. నాణ్యత ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని.. కల్వకుంట్ల కుటుంబం నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేయాలి. ఈ ఘటనపై ఇప్పటికే కిషన్ రెడ్డి.. కేంద్రానికి లేఖ రాశారు. - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి