అనాథలకు అన్నీ తామై అండగా నిలబడడమే కాకుండా వారికి పెళ్లి చేసి వారి భవిష్యత్తుకు దారి చూపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు కరీంనగర్‌కు చెందిన ఓ అనాథ ఆశ్రమ నిర్వాహకులు. కన్నవాళ్లే కాదనుకున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తోంది ఆశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మ.
ఆరేళ్ల కిందట అనాథ.. ఇప్పుడు ఓ యింటివెలుగు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెళ్లికి చెందిన ఎనుగుల యమున అనే యువతి ఆరేళ్ల కిందట తల్లిని కోల్పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నాడు. నా అన్నవాళ్లు లేని ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకుంది అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు గుర్రం పద్మారెడ్డి. ఆ యువతిని పెద్దచేసి తగిన వరుడుని చూసి ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరాడంబరంగా పెళ్లి చేసి అత్తింటికి సాగనంపారు.
పెళ్లికి అయ్యే ఖర్చులన్నింటినీ పద్మారెడ్డి సొంతంగా భరించారు. బాలకృష్ణ, చంద్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు వధువుకు తాళిబొట్టు అందించారు. వారి బంధువులే వరుడు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. వివాహానికి హాజరైనవారంతా పద్మావతి చేస్తున్న సహాయాన్ని కొనియాడారు.
అనాథనే కోడలిగా..
ఎంతోమంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపిన పద్మారెడ్డి ఇప్పటి వరకూ ఆరుగురు అనాథ పిల్లలకు వివాహం చేసింది. అనాథగా చేరిన సంధ్య అనే యువతిని స్వయంగా తన కోడలిని చేసుకుంది. నా అన్న వారు లేని వారిని అక్కున చేర్చుకుని వారి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్న పద్మారెడ్డి ఎందరికో ఆదర్శం.
ఇదీ చదవండి: భానుడి భగభగలు.. ఆరోగ్య సూత్రాలు