హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయనకు మద్దతుగా మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవాలని ఒక్క హుజూరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ గెలుపుతో రాబోయే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వానికి మరో అడుగు పడుతుందన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో నాయకులు తలమునకలయ్యారు. ప్రత్యర్థి పార్టీలకంటే ముందుండాలన్న ఉద్దేశంతో సభలు, సమావేశాలు జోరుగా నిర్వహిస్తూ పోటీలో ఉన్న ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి భాజపా నాయకులు అబద్ధపు మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా మల్లారెడ్డిపల్లితో పాటు వీణవంక మండలం చల్లూరులో ప్రచారం నిర్వహించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే భాజపా మాత్రం అసత్యాలు చెబుతోందని, గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే విద్యార్థులు యువత కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశంతోనే విద్యార్థి నాయకుడైన వెంకట్‌కు టికెట్ ఇచ్చామని వెల్లడించారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం తెరాస, భాజపాలు నోట్లు వెదజల్లుతున్నాయని అన్నారు.
ఇదీ చూడండి: Huzurabad by election: ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల ఘట్టం.. ప్రచారాలపై ఈసీ ఆంక్షలు