అర్ధరాత్రి నీటి ప్రవాహంలో ఇరుక్కపోయిన ఓ వ్యక్తిని కాపాడారు హుజూరాబాద్ పోలీసులు. కరీంనగర్ జిల్లా జూపాకకు చెందిన గిన్నారపు మహేందర్ హుజూరాబాద్‌లోని ఓ మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. తన పనులు ముగించుకొని రాత్రి ఇంటికి బయల్దేరాడు. చెల్పూరు నుంచి జూపాక మధ్యలో ఉన్న వాగులో నీటి ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు వెళ్లాడు. భారీగా ప్రవాహం ఉండటం వల్ల మధ్యలో ఇరుక్కపోయాడు.
కాపాడండి... కాపాడండి అని అరిచినప్పటికీ అందుబాటులో ఎవరు లేకపోయారు. మహేందర్ హుజూరాబాద్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు విషయాన్ని వివరించాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మాధవి, బ్లూకోల్ట్స్, పెట్రో కారు సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొన్నారు.
నీటి ప్రవాహంలో ఇరుక్కపోయిన వ్యక్తిని గుర్తించారు. సిబ్బంది తాళ్ల సహయంతో కొద్దిదూరం వెళ్లి తాళ్లను అందించగా, ఆ తాడును పట్టుకున్నాడు మహేందర్. తాడు సహయంతో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన మహేందర్‌ను బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మహేందర్‌ను క్షేమంగా ఇంటికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ మాధవిని, బ్లూకోల్ట్స్, పెట్రో కారు సిబ్బందిని ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు.