కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామ శివారులో ముత్యాల వెంకటమల్లుకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కవిత, సారవ్వ, చిన్న కుమారుడు నాగరాజు చిన్నతనం నుంచే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. వెంకటమల్లు మిగిలిన ముగ్గురు కుమారులు... వీరికి దూరంగా ఉంటూ తమ దారి వారు చూసుకున్నారు.
సరైన ఇల్లు లేదు..
పదేళ్ల క్రితం వెంకటమల్లు భార్య మృతిచెందడంతో... పూర్తి స్థాయిలో పిల్లల బాధ్యత అతనిపైనే పడింది. అప్పటి నుంచి గ్రామాశివారులో ఓ పూరి గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు వచ్చే పింఛన్ డబ్బు, రేషన్ బియ్యంతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్న... తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. వృద్ధాప్య దిశలో ఉన్న తాను మరణిస్తే పిల్లలను చూసే దిక్కు ఉండరంటూ వెంకటమల్లు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఊరి చివర ఉండటం వల్ల.. విషపురుగులు, పాములు బెడద సైతం ఉంటుందని వాపోయాడు. సరైన ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
ప్రభుత్వ అధికారులు, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఉండేందుకు పక్కా ఇల్లు ఇప్పించి... మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నాడు. మానసిక వైకల్యంతో ఉన్న ముగ్గురు పిల్లలకు పింఛన్లు మంజూరు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... పలు లోపాల కారణంగా వారికి మంజూరు కావడం లేదని గ్రామసర్పంచ్ తెలిపారు. ప్రభుత్వం వెంకటమల్లు కుటంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: కళ్లలో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో పిల్లలతో కలిసి భర్తపై దాడి