కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పురపాలక సంఘంలోని నాలుగు కో-ఆప్షన్ స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. 12 మంది కౌన్సిలర్లకు తొమ్మిది మంది తెరాస, ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోవడం వల్ల ఎన్నికను బహిష్కరించి వెళ్లిపోయారు.
నాలుగు స్థానాలకు మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ సమర్పించారు. అనుభవం కలిగిన జనరల్ కోటా నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉండగా... బుర్రి లక్ష్మీ, ఎడ్ల కిషన్‌కు సభ్యులు మద్ధతు తెలిపారు. ఒక్కో నామినేషనే దాఖలు కావడం వల్ల... మైనారిటీ జనరల్ కోటాలో ముజీబుద్దీన్, మహిళా కోటాలో తస్లిమ్ జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులకు ఛైర్మెన్, వైస్ ఛైర్పర్సన్, కమిషనర్ ధ్రవీకరణ పత్రాలు అందజేసి, సన్మానించారు.
ఖాళీగా ఉన్న సిబ్బందిని నియమించకుండా తెరాస నిరుద్యోగ కార్యకర్తలకు పట్టం కడుతున్నారని... కాంగ్రెస్ కౌన్సిలర్లు విమర్శించారు. కార్యాలయంలో మేనేజర్, అకౌంటెంట్, బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్, విద్యుత్ సిబ్బంది లేక ఇబ్బందులు పడుతుంటే... తెరాస బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిపారని కౌన్సిలర్లు మహేశ్వరి, బాలమణి, విజయలక్ష్మి ఆరోపించారు.