కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కందుల సాగు ఎక్కువ. భారీ వర్షాలతో కొంత వరకు దెబ్బతింది. కొందరు దీన్ని తీసేసి ఇతర పంటలు సాగు చేశారు. చివరికి ఈసారి 36,004 ఎకరాల్లో సాగైంది. ఎకరానికి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ లెక్క ప్రకారం 1,80,020 క్వింటాళ్ల దిగుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. క్వింటాకు రూ.6వేల మద్దతు ధర కేంద్రం ప్రకటించింది.
అక్కడి వ్యాపారుల రాకతో
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కంది సాగు ఎక్కువ. ఆయా రాష్ట్రాలో ఈఏడాది కురిసిన భారీ వర్షాలకు దిగుబడి లేక కందికి కొరత ఏర్పడింది. పంట లేకపోవడంతో పప్పు మిల్లులు వెలవెలబోతున్నాయి. మహారాష్ట్రలోని ఉద్గీర్, దెగ్లూర్, ముఖేడ్ పట్టణాల్లో కందులు కొనుగోలు చేసే వ్యాపారులు ఎక్కువ.. ఇక్కడే పప్పు మిల్లులు అధికంగా ఉన్నాయి. ఆయా పట్టణాలు జుక్కల్ నియోజకవర్గానికి చేరువలో ఉన్నాయి. వారంతా జుక్కల్ వైపు దృష్టి సారించారు. క్వింటాకు రూ.7,100 చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎప్పుడూ నష్టాలే..
ఏటా పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే పైసలకు నెలల తరబడి ఎదురు చూడాలి. కార్యాలయం చుట్టూ తిరిగినా అవసరమైన సమయంలో సొమ్ము చేతికందదు. ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యాపారులే సొంతూరికొచ్చి కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర పట్టణాల్లో, ఇక్కడ కొనుగోలు విషయంలో రూ. 300 నుంచి రూ. 500 తేడా ఉంటుంది.
క్వింటా రూ. 6800 తీసుకొంటున్నా
కందుల్లో తెల్ల, ఎర్రవి ఉన్నాయని... వాటిలోనూ సీడ్స్, గౌరాని కందులుంటాయని కంది వ్యాపారి గంగాయప్ప తెలిపారు. గౌరాని (స్థానికంగా విత్తే విత్తనాలు) కంది పప్పు ఎంతో రుచికరమని వెల్లడించారు. ప్రస్తుతం రూ. 6,800 క్వింటా చొప్పున కొనుగోలు చేసి, పప్పు మిల్లులకు పంపిస్తున్నామని తెలిపారు. 30 కిలోమీటర్ల దూరం ఉన్న మహారాష్ట్రకు వెళ్లాలంటే అమ్మకపు పన్ను చెల్లించాల్సి వస్తుందని... రవాణా ఖర్చు, చెత్త, చెదారం తొలగించాలన్నారు. అక్కడి కన్నా రూ. 300 తక్కువ తీసుకొంటున్నామని పేర్కొన్నారు.
వ్యాపారులకే అమ్మేశాను
మనవరాలి పెళ్లి కుదిరిందని... కంది కొనుగోలు కేంద్రం తెరవలేదని ఆందోళన చెందినట్లు కంది రైతు బాళుగొండ తెలిపారు. అంతలోనే మహారాష్ట్ర వ్యాపారులొచ్చారని.. క్వింటాకు రూ. 6100 చొప్పున 12 క్వింటాళ్లు అమ్మేశానని తెలిపారు. అమ్మిన రెండ్రోజులకే క్వింటా ధర రూ. 6800 కొనుగోలు చేశారని వాపోయారు. కొంత నష్టమైనా.. మద్దతు ధర కంటే రూ. 100 ఎక్కువే వచ్చాయని... వెంటనే నగదు పెళ్లి ఖర్చులకు ఉపయోగించానని తెలిపారు.
ఇదీ చూడండి: సాగు భళా.. రుణం డీలా...