TS high court on Kamareddy Master Plan :కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని.. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కి హైకోర్టు వాయిదా వేసింది.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా: మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఉదయం 9 గంటల నుంచి ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనకు భాజపా నేత వెంకటరమణారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, వైతెపా నేతలు మద్దతు తెలిపాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ ప్రజలు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన రైతు సంఘం ప్రతినిధులను ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరు రైతు నాయకులు పోలీసుల కళ్లు గప్పి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: