Teachers Protest for Students: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కర్ణంగడ్డ గ్రామంలో విశేషం చోటుచేసుకుంది. స్థానిక పొతంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కర్ణంగడ్డకు చెందిన 30 మంది విద్యార్థులు 20 రోజుల నుంచి హాజరు కావడంలేదు. గైర్హాజరవుతున్న విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటూ స్వయంగా ప్రధానోపాధ్యాయుడు సహా ఉపాధ్యాయులు వారి ఇళ్ల ముందు బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్, ఉపాధ్యాయులు మాట్లాడారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తండా నుంచి పొతంగల్ వరకు 3 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు దారుణంగా మారిందని, అందుకే విద్యార్థులను పంపడం లేదని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. రోడ్డుకు మరమ్మతులు చేయిస్తేనే పిల్లలను పాఠశాలకు పంపిస్తామని కరాఖండిగా చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు గంటపాటు విద్యార్థుల ఇంటి ముందు బైఠాయించారు. సమస్యను సర్పంచి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నచ్చజెప్పారు. ఆ వెంటనే దాదాపు 20 మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలకు వెళ్లారు.