కామారెడ్డి జిల్లాలో చాలా మంది రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపారు. కురుస్తున్న వర్షాలు పైరు ఏపుగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి. ఇప్పటి వరకు చీడపీడల బెడద లేదు. దిగుబడిపై అన్నదాతలు ఆశలు పెంచుకున్నారు. గిట్టుబాటు ధర ఉంటేనే కర్షకుల కష్టాలు తీరనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తిబేళ్ల ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. బహిరంగ విపణిలో ధరలు అంతంత మాత్రమేనంటున్నారు. పత్తి రైతుకు సీసీఐ కేంద్రాలతోనే కనీస మద్దతు ధర లభించే అవకాశం ఉంది.
వ్యాపారులకే సిరులు
గతం పునరావృతమవుతుందా..? పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. కొన్నేళ్లుగా పత్తి విక్రయాలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తెల్లబంగారం వ్యాపారులకు సిరులు కురిపిస్తోంది. మద్నూర్‌లోని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకొని అన్నదాతల ఇంటి వద్దనే కొనుగోలు చేస్తున్నారు. రైతుల పేరిట సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి భారీగా లాభాలు గడిస్తున్నారు.
దళారులకు విక్రయించుకోవాల్సిందేనా
భారత పత్తి సంస్థ (సీసీఐ) మూడేళ్ల నుంచి కొనుగోలు కేంద్రాలను కేవలం జిన్నింగ్ మిల్లుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మద్నూర్ మండల కేంద్రంలో మాత్రమే జిన్నింగ్ మిల్లులున్నాయి. సరిహద్దులో ఉన్న మద్నూర్‌కు పత్తి తరలించాలంటే రవాణా పరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో భారీగా వ్యయం కానుంది. తెల్లబంగారం పండించే కర్షకులు గత్యంతరం లేక దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి.
మద్దతు ధర దక్కాలంటే...
● పత్తి పండించే రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేసి, మండల కేంద్రాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
● సీసీఐ కేంద్రాల్లో విక్రయించినప్పుడు 12 శాతం తేమతో కూడి, నాణ్యతా ప్రమాణాలున్నపుడు కనీస మద్దతు ధరను రైతులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
● ఏటా సీసీఐ(భారత పత్తి సంస్థ) కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలి.
● ఇప్పటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాల్సిన ఆవశ్యకత జిల్లా యంత్రాంగంపై ఉంది.
ఇవీ చూడండి: కలెక్టర్ సుడిగాలి పర్యటన... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం