కామారెడ్డి జిల్లా కేంద్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ శరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అగ్రస్థానంలో జిల్లా
నూతన జిల్లాగా ఏర్పాటైన కామారెడ్డిలో అభివృద్ధి వేగంగా సాగుతోందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగం నిరంతరంగా కృషి చేస్తోందని కొనియాడారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపామని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా డిజిటల్ ఇండియా అవార్డు అందుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్రంలోనే తక్కువ కేసులు
కరోనా పాజిటివ్ కేసులు 8.62 శాతం నుంచి 0.56 శాతానికి తగ్గటంతో రాష్ట్రంలోనే తక్కువ కేసులు నమోదైన జిల్లాగా కామారెడ్డి నిలిచిందని శరత్ వెల్లడించారు. వీధి విక్రయదారులకు రుణాలు అందించడంలో దేశంలోనే కామారెడ్డి మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు.
ఇదీ చదవండి: ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు