కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 28 రోజుల్లోగా నూతన కలెక్టర్ భవనాన్ని పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అనంతరం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో 3 లక్షల 20 వేల చేప పిల్లలను ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి విడుదల చేశారు.
కామారెడ్డి జిల్లాలో 578 చెరువులలో 3 కోట్ల వ్యయంతో... 35 లక్షల చేప పిల్లల పెంపకం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 216 చెరువులలో 75 లక్షల వ్యయంతో 82 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ చేప పిల్లల ద్వారా మత్స్య కారులకు 16 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపారు.
దేశంలో సముద్ర తీరం ఉన్న ఏ రాష్ట్రంలో ఈ పథకం అమలు కావడం లేదని చెప్పారు. మత్స్య కారుల కుటుంబానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. చేపలను బయట దేశాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం లోతుగా చర్చిస్తోందని వివరించారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్