హరితహారానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 20 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే అనుకున్న సమయానికి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈసారి పల్లెలు, మున్సిపాలిటీల్లో 65.20 లక్షల మొక్కలు నాటుతారు. గ్రామాల్లో గుంతలు తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆయా ప్రభుత్వ శాఖలు హరితహారంలో భాగస్వాములవుతున్నాయి.
అంతర్గత రోడ్లు, ఖాళీ స్థలాలు
ఈ ఏడాది పల్లెల్లో అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రజలకు అవసరమైన మొక్కల వివరాలను అధికారులు సేకరించారు. వారి అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పండ్ల మొక్కలు అందజేస్తారు. వీటి పర్యవేక్షణ బాధ్యత ఇంటి యజమానులే చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల లక్ష్యం విధించేవారు. అనుకున్న లక్ష్యం అందుకోక, చాలా మొక్కలు వృథా కావడంతో ప్రభుత్వం పంచాయతీల తీర్మానాల ప్రకారమే నిర్ణయింపజేసింది. పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలను కూడా ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం
హరితహారంలో ప్రతి ప్రభుత్వశాఖకు భాగస్వామ్యం కల్పించింది. పథకం ప్రారంభం రోజున ప్రతి శాఖ ఐదు ప్రాంతాల్లో మొక్కలు నాటించాలని పాలనాధికారి శరత్ ఇటీవల ఆదేశించారు. విద్యాశాఖ జిల్లాలో అన్ని పాఠశాలలు, వాటి ఆవరణలో మొక్కలు నాటించాలి. వ్యవసాయశాఖ రైతు క్టస్టర్లలో రైతు వేదికల నిర్మాణాల కోసం తీసుకున్న 20 గుంటల భూముల్లో మొక్కలు నాటాలి. జిల్లాలో గుర్తించిన 300 కోతుల ఆహార ప్రాంగణ మైదానాల్లోనూ మొక్కలు నాటించాలి. ఒక్కో ప్రాంగణంలో 500 మొక్కలు నాటాలి. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పరిశ్రమల ఆవరణలు, చెరువు గట్లు, వసతిగృహాలు, విద్యుత్తు ఉపకేంద్రాల ఆవరణలో నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మొత్తం నర్సరీలు | 526 |
ఇప్పటికే వ్యయం చేసిన నిధులు | 4.56 కోట్లు |
మొక్కలు నాటే లక్ష్యం | 65.20లక్షలు |
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు