కామారెడ్డి జిల్లా దోమకొండ, భిక్కనూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. కొంతకాలంగా దోమకొండ, భిక్కనూర్ మండలాల పరిధిలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున స్థానిక నేతలు గులాబీ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తెరాస పార్టీలో చేరిన జడ్పీటీసీలతో దాదాపు ఆ రెండు మండలాలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన తిరుమల గౌడ్, పద్మ నాగభూషణం గౌడ్ లతో పాటు ఇతర నాయకులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం తెరాసలో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. తమ లక్ష్యం కామారెడ్డి నియోజకవర్గం అభివృద్దేనని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రావు, దోమకొండ, భిక్కనూర్ మండలాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ