కామారెడ్డి జిల్లా గాంధారి, సదాశివనగర్ మండలాల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. రేపు ప్రారంభం కాబోతున్న ఆరో విడత హరితహారం పనులను పరిశీలించారు. ఆర్ అండ్ బీ రోడ్లలో ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుని మూడు వరుసలలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, చింత, వేప, మోదుగ మొక్కలను ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలతో గ్రామాల్లోని వీధులలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కార్యదర్శులకు చెప్పారు. పల్లెప్రగతి పది ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాల వద్ద మొక్కలు నాటి సంరక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. గాంధారిని పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు చురకలు అంటించారు. అంతేగాక రోడ్డుకిరువైపులా మురికి కాలువలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీపీవో సాయన్న, డీఎఫ్వో వసంత, ఎంపీడీవోలు అశోక్, రవి, ఈశ్వర్ గౌడ్, తహసీల్దార్లు రవీందర్, నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న పొదరిల్లు