కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వానాకాలం సాగు విధాన ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోసం నూతన సాగు ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు.
ప్రతిసారి రైతులందరూ ఒకే రకమైన పంటలు పండించడం వల్ల మార్కెట్లో వాటి డిమాండ్ తగ్గుతుందని... అందుకే రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నవీన కాలంలో ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినడానికే మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. దొడ్డురకం బియ్యం పండించటం వల్ల రైతులకు లాభాలు తెచ్చిపెట్టదని తెలిపారు. కావున రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వెయ్యాలని సూచించారు.