ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఆశా కార్యకర్తలు, ఆటో డ్రైవర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 3 వేల 650 మందికి రూ. 18.50 లక్షలతో నిత్యావసర వస్తువులను వితరణ చేసినట్లు గోవర్ధన్ తెలిపారు. దాతలు వీరిని ఆదుకోడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఆశా కార్యకర్తలు, పోలీస్, వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టడి చేశారని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడు విధిగా మాస్కులు ధరించాలని జిల్లా కలెక్టర్ శరత్ సూచించారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని కోరారు. మాస్కులు ధరించని వారికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో చాలామంది దాతలున్నారని.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది సేవాభావం అలవర్చుకోవాలని కోరారు.
లాక్ డౌన్ నిబంధనలు పాటించని వ్యక్తులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్వేతా తెలిపారు. నిత్యం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?