కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నియంత్రిత పంట సాగును వ్యతిరేకిస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రహదారిపై రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలనడం, లేకపోతే.. ప్రభుత్వ పథకాలు వర్తించని రైతులను బెదిరించడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి చెప్పిన పంటలు వేస్తే.. నష్టపోయేది రైతులా..? ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. ఏ రైతైనా.. భూములకు అనువైన పంటలు వేయాలని చూస్తాడు కానీ.. ప్రభుత్వాలు చెప్పే పంటలు కాదు. ఏ భూమిలో ఏ పంట పండుతుందో రైతుకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారిగా రైతులంతా నియంత్రిత పంటసాగుకు వ్యతిరేకంగా సర్పంచుల ఆధ్వర్యంలో తీర్మానాలు చేస్తున్నారని, తీర్మానాల కాపీలను మంత్రి ప్రశాంత్ రెడ్డికి అందిస్తామని రైతులు, అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీజేపీ అద్యక్షుడు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు