చేతికొచ్చిన పంట భారీ వర్షాలకు నీటిపాలైంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం, బొప్పాజీవాడితో చేతికొచ్చిన పత్తి, సోయాబీన్, కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరపిలేని వర్షాలతో చెట్టుపైనే పత్తి, సోయాబీన్ మొలకలొచ్చాయి. కందిపంట నీట మునిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే సర్వనాశనమవుతుంటే... రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బొప్పాజీవాడికి చెందిన రవిజాదవ్ ఎకరానికి రూ.15 వేలు ఖర్చు పెట్టి 6 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పూర్తిగా నష్టపోయానని కుమిలిపోతున్నాడు. తిప్పారం గ్రామానికి చెందిన శంకర్రావు ఎంఏ చదివి వ్యవసాయం మీద మక్కువతో... 17 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయాబీన్, కంది సాగు చేస్తున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చి పంట నేలపాలైందని ఆవేదన చెందుతన్నాడు. ఎకరానికి రూ.15లు పెట్టుబడి పెట్టానని... ఒక్క రూపాయి కూడా వచ్చేలా లేదని వాపోయారు. గాంధారికి చెందిన కుమ్మరి సాయిలు 2 ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేశాడు. ఎకరానికి రూ.5 వేలకు కూలీలతో కోతలు మొదలుపెట్టగానే... వర్షం కరిసింది. దీంతో కోసిన పంట పొలంలోనే మొలకలు వచ్చాయి.
గాంధారిలో కురిసిన వర్షాలకు పదుల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. పక్షం రోజుల్లో కోసే పంట నీట మునిగి... మొలకలు వచ్చాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కుమ్మరి శ్రీకాంత్ అనే యువకుడు... లాక్డౌన్తో పనులు లేక వ్యవసాయాన్ని నమ్ముకొని 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. సరిగ్గా పంట కోసే సమయానికి వర్షం వచ్చి పంట నేలకొరిగింది. కుమ్మరి కృష్ణ అనే వ్యక్తి 5 ఎకరాల్లో వరి పంట సాగు చేసాడు. అతనిది అదే పరిస్థితి. వర్షం కారణంగా నష్టపోయిన పంటకు ప్రభుత్వ పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయాధికారులు ఇప్పటికీ పంట నష్టం అంచనా వేయకపోవడం బాధాకరమని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు