కంటికి కనిపించని కొవిడ్-19 శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేస్తోంది యావత్ ప్రపంచం. ఈ కనిపించని కరోనా మహమ్మారిపై చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతోన్న యోధుల్లో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు ముఖ్యమైనవారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ వైరస్ నివారణ, నియంత్రణ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ కరోనా మహమ్మారి సోకకుండా ఉండాలంటే... వీరందరికీ స్వీయ రక్షణ ఎంతో అవసరం.
మాస్క్‌లు, గ్లౌజ్‌లు, షూస్ వంటివి ధరించి, వారు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ వీటిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత అందరికీ ఉండదు. ఈ విషయాన్ని గమనించిన జిల్లా ఎస్పీ శ్వేత పోలీస్‌శాఖ సహాయంతో వీరికి ఈ వస్తువులు అందించేందుకు ముందుకు వచ్చారు. కరోనాపై పోరులో తమతో పాటు పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు కామారెడ్డి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత... రూ.1,80,000 విలువైన మాస్క్‌లు, షూస్, గ్లౌజ్‌లు, ఆప్రాన్లను శుక్రవారం అందించారు.
లాక్డౌన్ విధించటంతో ఎక్కడి వలస కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. కామారెడ్డిలో కూడా సుమారు 160మంది కార్మికులు చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 60మందిని భిక్కనూర్‌లో, 100మందిని సదాశివనగర్ మోడల్ స్కూల్లో ఉంచి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు, వలస కూలీలను ఆదుకోవాలని ఎస్పీ శ్వేత గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ఏఆర్, హెడ్‌క్వార్టర్స్, పోలీసు సిబ్బంది కలిసి సుమారు రూ.5 లక్షల వరకు పోగుచేశామని ఏఆర్ సీఐ నర్సింహరావు తెలిపారు. ఈ మొత్తం డబ్బుల్లో నుంచే ఇన్నాళ్లు కూలీలందరికీ ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం 140మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.1,80,000 విలువైన మాస్క్‌లు, షూస్, గ్లౌజ్‌లు, ఆప్రాన్లను కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శరత్... నిరుపేదలకు బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీవో రాజేంద్ర కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ జాహ్నవి, డీఎస్పీ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మాస్క్‌ల బజార్ చూసొద్దామా...!