Madnur Rural Hospital in Kamareddy : కామారెడ్డి జిల్లా మద్నూర్లోని పల్లె దవాఖాన పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇక్కడ ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు సైతం నిర్వహిస్తారు. 1960లో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు పెచ్చులూడి పడిపోతుండటంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో భవనం మొత్తం ఉరుస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం పరిస్థితి చూసి టీకాలు తీసుకునేందుకు వెళ్లే పరిస్థితి లేదని బాలింతలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏళ్లుగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండలో బాలింతలకు నరకం చూపించిన వైద్యుడు
''1960లో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చిన్న పిల్లలకు టీకాలు, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడికి చిన్న పిల్లలను తీసుకు రావాలంటే భయపడుతున్నారు. వర్షాలకు దస్త్రాలు తడిచిపోతున్నాయి. కూలిపోయే స్తితిలో ఉన్నా.. వేరే బిల్డింగ్‌లోకి ఎందుకు మార్చట్లేదు. రోజూ కురుస్తున్న వర్షాలకు భవనం ఉరుస్తుంది. ఈ భవనాన్ని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నపించినా పట్టించుకోవట్లేదు. ఇలాంటి దాంట్లో మేము పని చేయలేమని కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఇచ్చాము. అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వెంటనే స్పందించి వేరే భవనంలోకి మార్చాలని కోరుతున్నాము. -వైద్య సిబ్బంది
శిథిలావస్థకు చేరిన భవనంలోనే పల్లె దవాఖాన, ఆయుర్వేద ఆసుపత్రి, హెచ్ఐవీ రోగులకు మందులు ఇవ్వడంతో పాటు రక్త పరీక్షలు చేస్తుంటారు. ఈ ఆసుపత్రి వరండాలో శవపంచనామ సైతం చేస్తారు. ఇక్కడికి వచ్చే రోజులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. వైద్య సిబ్బందికి కుర్చీలూ లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలలు పరిస్థితి ఐతే చెప్పనవసరం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పల్లె దవాఖానను శిథిలావస్థ భవనం నుంచి వేరే చోటుకు మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
''బిల్డింగ్ మొత్తం శిథిలావస్థలో ఉంది. భవనం పైకప్పు పెచ్చులూడి నీళ్లు భవనంలోకి వస్తున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. కరెంటు వైర్లు సరిగా లేక గోడలకు ఎర్తింగ్ వస్తుంది. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తుంది. ఉన్నతాధికారులు స్పందించి వేరే భవనంలోకైనా మార్చండి లేకుంటే కొత్త భవనాన్ని కట్టించండి.'' -గ్రామస్థుడు
ఇవీ చదవండి..