దురదృష్టం వెంటాడటం అంటే ఇదేనేమో.. శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చిన్నశంకరంపేటకు చెందిన వెంకటేశ్, అతని అల్లుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణికి చెందిన విజయ్‌లు హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలోని క్యాంటీన్‌లో పని చేసేవారు. శుక్రవారం వారు చిన్నశంకరంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయారు.
విజయ్ తల్లిదండ్రులు మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చారనే విషయం ఆరా తీయగా అతనికి 15 రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 14 రోజుల పాటు అక్కడే స్వీయ గృహ నిర్బంధంలో ఉండి గురువారం మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ రావడంతో అక్కడున్న అధికారులు అతన్ని ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శుక్రవారం మామతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగి మామా అల్లుళ్లు ఇద్దరు మృత్యువాత పడ్డారు. విజయ్ కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలుసుకొని అతన్ని ఆసుపత్రికి తరలించిన అంబులెన్సు సిబ్బంది, శవపరీక్ష చేసిన సిబ్బంది భయాందోళన చెందగా నెగిటివ్ వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉండవని, భయపడాల్సిన అవసరం లేదని తూప్రాన్ వైద్యులు భరోసా ఇచ్చారు.
గ్రామంలోకి మృతదేహం నిరాకరణ..
తూప్రాన్‌లో శవపరీక్ష అనంతరం అంబులెన్సులో విజయ్ సొంత గ్రామం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అతను కరోనా బారిన పడిన విషయం తెలుసుకొన్న గ్రామస్థులు మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లనివ్వలేదు. పక్షం రోజుల క్రితం ఎల్లారెడ్డి పోలీసులు, వైద్యులు ఇంటికి వచ్చి ఆరా తీయడంతో కరోనా వచ్చినట్లు ధ్రువీకరించినట్లయింది. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక విజయ్ మృతదేహాన్ని శనివారం నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిన కొడుకు చివరి చూపునకు సైతం నోచుకోకుండానే మట్టిలో కలిసి పోవడంతో కుటుంబసభ్యులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు