Nirmala Sitaraman serious on Collector: కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీర్కూర్‌లో రేషన్ దుకాణాన్ని సందర్శించారు. ప్రజలకు ఇస్తున్న రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పాలని లబ్ధిదారుల ముందే నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంతో చెప్పాలంటూ లబ్ధిదారుల ముందు కలెక్టర్‌ను నిలదీశారు. పాలనాధికారి సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం కేవలం ఐదు రూపాయలు ఖర్చు చేస్తుందని నిర్మల అన్నారు. ప్రజలకు అసలు విషయం చెప్పాలనే పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ దుకాణం వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో లేకపోవడంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు. మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. మరోసారి వచ్చేసరికి ప్రధాని ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
అంతకుముందు బాన్సువాడలో నిర్మాలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్మలా కాన్వాయిను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కోటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత టీకా కేంద్రాన్ని నిర్మల తనిఖీ చేశారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు