కామారెడ్డిలోని దేవునిపల్లిలో నివాసం ఉండే ఓ బాలుడు ద్విచక్రవాహనంపై వెళ్తూంటే... పక్కింటి వాళ్లు పెంచుకుంటున్న కుక్క ఎదురు తిరిగింది. బాలుడికి భయం వేసింది. తేరుకున్నాక కోపంతో ఊగిపోయాడు. కత్తి తీసుకుని వీరంగం సృష్టించాడు. కుక్క అడ్డొస్తేనే... కత్తితో హల్చల్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా...? ఒక్కసారైతే... పర్లేదు తప్పించుకుని వెళ్లిపోవచ్చు. కానీ... అదేమిటో బాలుడు బైక్పై వెళ్తున్న ప్రతీసారీ... అడ్డొచ్చి చికాకు తెప్పిస్తోందట మరి ఆ కుక్క..!
కత్తితో వార్నింగ్..
ఆదివారం రాత్రి సమయంలో బాలుడు ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. పక్కింటి కుక్క ఒక్కసారిగా అడ్డొచ్చింది. రోజూ విసిగిస్తున్న కుక్క.. ఆ రోజు కూడా అడ్డొచ్చి చికాకు తెప్పించింది. ఆ బాలుడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కుక్క యజమానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోయేసరికి వాగ్వాదానికి దిగాడు. కోపంతో తన వద్ద ఉన్న కత్తి తీసి భయపెట్టాడు. బాలుని చేతిలో కత్తి చూడగానే... అక్కడ గుమిగూడిన జనాలు భయంతో రోడ్డుపై పరుగులు తీశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని... బాలున్ని పోలిస్స్టేషన్కు తరలించారు.