పాఠశాల రంగులపై తెరాస నాయకుల అత్యుత్సాహం ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాలకు గులాబీ రంగులపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన భాజపా నాయకులు ఆరోపించారు.
గ్రామ సంఘాల విరాళాలతో సేకరించిన డబ్బులతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు గులాబీ రంగులు వేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌడ సంఘం ద్వారా రూ.1.25 వేలు రాగా పాఠశాలకు తెరాస రంగు ఎందుకు వేస్తున్నారని భాజపా గ్రామ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఠల్ రెడ్డిని వివరణ కోరగా.. రంగులు వేయడంపై తన ప్రమేయం ఏమి లేదన్నారు. పాఠశాల కమిటీ ఛైర్మన్లు, గ్రామస్థుల నిర్ణయం ప్రకారమే వేస్తున్నారని ఆయన బదులిచ్చినట్లు భాజపా నాయకులు వెల్లడించారు.