ప్రాణం పోసే వాడు దేవుడు.. ఆ ప్రాణాలు నిలబెట్టే వాడు వైద్యుడు.. అంటారు. అదే ప్రాణం కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. సురక్షితంగా కాపాడినప్పుడు ఆ వైద్యుడినే దేవుడని కొనియాడుతారు. ఇక్కడ ఆ కుటుంబానికి మాత్రం అంబులెన్స్ సిబ్బందే వైద్యదేవుళ్లయ్యారు.
అంబులెన్స్ సిబ్బందే వైద్యుల్లా మారారు. పండంటి బిడ్డకు పురుడు పోసి.. రెండు ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రామాయిపల్లి తండాకు చెందిన వనితకు నెలలు నిండాయి. ఉదయం పూట నొప్పులు వచ్చాయి. నొప్పులు తీవ్రం కావటంతో.. ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన తండాకు చేరుకున్న అంబులెన్స్.. వనితను కామారెడ్డి ఆస్పత్రికి తరలించేందుకు పయనమైంది.
ధైర్యం చెప్తూ..
మార్గమధ్యలో వనితకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. వనిత తల్లడిల్లిపోతోంది. ఆమెతో ఉన్న వాళ్ల అమ్మ బిడ్డ పడుతున్న బాధ చూడలేక నమ్ముకున్న దేవుళ్లందరికీ మొక్కుతోంది. అంబులెన్స్‌లో ఉన్న సిబ్బంది అప్పటికీ.. ఇద్దరికీ ధైర్యం చెబుతూనే ఉన్నారు. అయినా.. వాళ్లు చెప్పే ధైర్యం ఆ పురిటినొప్పుల బాధను తట్టుకునే శక్తిని వనితకు ఇవ్వలేకపోతున్నారు. ఆస్పత్రి చేరుకునేందుకు ఇంకా సమయం పడుతుంది. బాధితురాలేమో.. తట్టుకలేకపోతోంది. ఈ సన్నివేశం చూస్తున్న సిబ్బందికి.. లోలోపల మనసు కలిచివేస్తున్నా.. పైకి అదేమీ కనిపించకుండా.. ధైర్యం చెబుతున్నారు.
సురక్షితంగా పురుడు పోసి..
ఆమె బాధను చూడలేక.. తల్లడిల్లిపోతున్న వనితకు పురుడు పోయటమే వారి ముందున్న లక్ష్యమని ఆ సిబ్బంది నిర్ణయించుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. అంబులెన్స్ సిబ్బంది కాస్తా.. వైద్యుల్లా మారిపోయారు. వారికున్న పరిజ్ఞానంతో.. వనితకు అంబులెన్స్‌లోని సుఖప్రసవం చేశారు. ఈ కాన్పులో పండంటి మగబిడ్డకు వనిత జన్మనిచ్చింది. సమయానికి సరైన నిర్ణయం తీసుకుని.. ఆ సిబ్బంది రెండు నిండు ప్రాణాలు కాపాడారు. ఇద్దరు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తదుపరి వైద్య సేవల నిమిత్తం.. కామారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
కుటుంబసభ్యుల కృతజ్ఞతలు..
సకాలంలో ప్రసవం చేసి.. ఇద్దరినీ కాపాడినందుకు అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అరవింద్, పైలట్ సంగాగౌడ్కు.. కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమయానికి దేవుళ్లలా వచ్చి పురుడు పోశారని భావోద్వోగానికి లోనయ్యారు. వారి వల్లే.. తన భార్య, కుమారుడు క్షేమంగా ఉన్నారని వనిత భర్త అభినందించారు. ఇది తమ బాధ్యత అని.. ఇందులో తమ ఘనతేమీ లేదని సిబ్బంది పేర్కొన్నారు. తమ చేతులతో పండటి బిడ్డకు పురుడు పోయటం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: