మద్యం ఓ గ్రామాన్ని రెండు వర్గాలుగా చీల్చిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉన్న చండేగావ్ గ్రామంలో జరిగింది. లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు మద్యం దుకాణాలు మూసి ఉంచారు. ప్రభుత్వ ఆదేశాలతో వారం రోజుల క్రితం మళ్లీ దుకాణాలన్ని తెరిచారు. అయితే పక్కనే ఉన్న మహారాష్ట్రలో మాత్రం ఇప్పటికీ మద్యం దుకాణాలు తెరచుకోలేదు. ఇదే అదనుగా భావించిన గ్రామానికి చెందిన పలువురు మద్యం వ్యాపారులు వైన్స్ నుంచి సుమారుగా 20 లక్షల విలువ చేసే మద్యాన్ని గ్రామంలోని బెల్టుషాపుల్లో నిల్వ ఉంచారు. మహారాష్ట్రకు చెందిన మద్యం ప్రియులు వచ్చి ఈ గ్రామంలో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేసి సేవిస్తున్నారు. దీంతో గ్రామంలో మద్యం మత్తులో ప్రజలంతా తూగుతూ విధులకు కూడా వెళ్లటం లేదు.
గ్రామంలో మద్యపాన నిషేధం విధించాలని గ్రామానికి చెందిన మహిళలందరు కలసి సర్పంచ్ ఇంటికి వెళ్లారు. స్పందించిన సర్పంచ్ వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేశారు. రచ్చబండ వద్ద ఒకవైపు మద్యం వ్యాపారులు, మద్యం ప్రియులు... మరో పక్క మహిళలు నిల్చున్నారు. మద్యం బంద్ చేయాలని కొంత మంది వాదిస్తే... మద్యం దుకాణాలు నడవాలని మరి కొందరు వాదించారు. ఇలా రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి స్థానికులను సముదాయించారు.
ఇవీ చూడండి: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం