Young farmer: లింగంపల్లి కిరణ్ కుమార్ స్వస్థలం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామం. తెలంగాణ యానివర్సిటీలో వివిధ అంశాలపై పీజీలు పూర్తి చేసిన కిరణ్.. 2015 తరువాత ఉద్యోగ అన్వేషణ కోసం దుబాయ్ వెళ్లాడు. మూడు నెలల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. అయితే.. జీతం తక్కువగా ఉండటం.. ఇతర కారణాలతో తిరిగి ఇంటికి వచ్చేశాడు.
ఆధునిక పద్ధతులపై అధ్యాయనం..
కిరణ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావడంతో... పొలం పనిపైనే దృష్టిపెట్టాలనుకున్నాడు. ఇంటర్నెట్, యూట్యూబ్ తదితర మాధ్యమాల సహకారంతో ఆధునిక పద్ధతుల గురించి అధ్యయనం చేశాడు. సాగులో మెళకువలు, మార్కెట్ డిమాండ్ అంచనాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ఐదేళ్ల క్రితం... నాలుగు ఎకరాలు నీటి సౌకర్యం ఉన్న పొలాన్ని కౌలుకు తీసుకున్న కిరణ్.. మొదట బొప్పాయి సాగు చేశాడు. నూతన వంగడాలతోపాటు మార్కెట్‌లో డిమాండ్ వచ్చే నాటికి దిగుబడి సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ఊహించని లాభాలు వచ్చాయి.
ఉద్యాన పంటల సాగుతో..
బొప్పాయి లాభాల ప్రోత్సాహంతో... ఉద్యాన పంటల సాగు వైపు ఆసక్తి కనబర్చాడు. అలా.. వంకాయ, టమాట, క్యాబేజి, ఆకుకూరలు సాగు చేశాడు. ఆయా పంటల సాగు కోసం మల్చింగ్, డ్రిప్ ఉపయోగిస్తూ బెడ్ పద్ధతిలో సాగు చేశాడు. డ్రిప్ విధానంలో మొక్కకు సరిపడా నీళ్లు అందడంతో నీటి వృథా ఉండదు. ఇక బెడ్ పద్ధతిని వినియోగించడం వల్ల మొక్కకు గాలి, వెలుతురు సమృద్ధిగా అందడంతో అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందంటున్నాడు... కిరణ్.
మార్కెట్‌లో డిమాండ్ పసిగట్టి..
ఉద్యాన పంటలు అనగానే తెగుళ్ల బెడద ఎక్కువని రైతులు భయపడిపోతుంటారు. మార్కెట్ పరిస్థితులు అంచనా వేయకుండా తోటి రైతులు ఏది వేస్తే మనం కూడా అదే వేస్తే నష్టాలు తప్పవని యువ రైతు కిరణ్ కుమార్ అంటున్నాడు. మార్కెట్‌లో డిమాండ్‌ను పసిగట్టి పంటలు వేయగలిగితే రైతులకు నష్టాలు ఉండవని సూచిస్తున్నాడు.
కుటుంబం అండగా..
కిరణ్ కుమార్ ఆధునిక పద్ధతులతో సాగు చేస్తానంటే కుటుంబం అతనికి అండగా నిలిచింది. కుటుంబ సభ్యుల నమ్మకాన్నికిరణ్ ఏడాది కాలంలోనే నిలబెట్టుకున్నాడు. దీంతో... కుటుంబమంతా కిరణ్ బాటలో పొలంలోనే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టిసారించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే.. ఉద్యాన పంటలు వేసే రైతులకు... వ్యవసాయ యంత్రాలు, రాయితీలు తదితరాలు కల్పిస్తే ఎక్కువ మంది ఇటువైపుగా వచ్చే అవకాశముందంటున్నాడు... కిరణ్ కుమార్.
ఇదీ చూడండి: