Family social exclusion : ఏడాది క్రితం జరిగిన వివాహానికి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు యెల్ది పోశయ్య, కొడుకు మహిపాల్, కోడలు రేణుక ఆదివారం తమ ఇంటికి తాళం వేసుకొని నిరసన తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య కుమార్తె ఏడాది క్రితం వివాహం చేసుకుని వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితం ఆమెతో కుటుంబానికి మాటలు కలిసి రాకపోకలు మొదలయ్యాయి. ఇది గమనించిన కుల పెద్దలు.. అప్పటి నుంచి తమకు భోజనాలు పెట్టాలని అడుగుతున్నారు. దుబాయ్ వెళ్లిన కొడుకు మహిపాల్ నెల రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇప్పుడైనా పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. వారు అంగీకరించకపోవడంతో ఏడాదిపాటు శుభ, అశుభ కార్యాలకు పిలవకుండా ఇటీవల బహిష్కరించారు. వెళితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవమానాలు భరించే కన్నా ఆత్మహత్యే మేలని కన్నీరుమున్నీరవుతున్నారు. సర్పంచి రాంరెడ్డిని వివరణ కోరగా కుల పెద్దలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భువనేశ్వర్‌రావు పేర్కొన్నారు.
- ఇదీ చదవండి : మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. ఆపై ఇనుప రాడ్తో