కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి భోజనం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
నెలరోజుల్లో ఇలాంటి సంఘటన జరగటం ఇది రెండోసారి. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యాన్ని అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు కారిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.