రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చేట్ల వరద ఉద్ధృతంగా ప్రవహిస్తూ... లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. రోడ్లపై నుంచి వెళ్తున్న వరదతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద పెరుగుతుందని గ్రహించని కొందరు కాపరులు... గొర్రెలను మేపేందుకు వెళ్లి ఉద్ధృతిలో చిక్కుకున్నారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండంలం సిర్పూర్-పోతంగల్ మధ్య మంజీరాలో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. మంగళవారం గొర్రెలతో వెళ్లిన 11 మంది కాపరులు మంజీరా వరద ఉద్ధృతికి అక్కడే చిక్కుకుపోయారు. రాత్రి నుంచి మంజీరా నదిలో ఇసుక ఒడ్డునే ఉన్న వారు... గ్రామస్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
అధికారులకు రాత్రే సమాచారం అందించామని... వారు పట్టించుకోలేదని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. కోటగిరి పోలీసులు, రెవెన్యూ బృందం... వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరంతా పెద్దటాక్లీ, చిన్నటాక్లీకి చెందిన కాపారులని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: విషాదం.. వంతెన దాటుతుండగా కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి