జూరాల జలాశయానికి పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి శనివారం 5,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. నాలుగు రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలోని ఒక మోటారు పంపును గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆన్ చేసి నీటిని వదిలారు.
జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుండటంతో పంపుల ద్వారా నెట్టెంపాడు పరిధిలోని జలాశయాలను నింపుతామని తెలిపారు.
ప్రస్తుతం 5వేలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో జూరాలలో నీటి నిల్వ 6.5 టీఎంసీలకు చేరుకున్నట్లు జలాశయం ఈఈ పార్థసారథి వెల్లడించారు. ఇన్‌ఫ్లో కొనసాగితే ఎత్తిపోతల పథకానికి నీటి మళ్లింపు ఉంటుందని, వరద ఆగిపోతే మోటారు పంపులను ఆఫ్ చేస్తామని వెల్లడించారు.
నాలుగు రోజుల నుంచి ఒక టీఎంసీ వరద జూరాలకు వచ్చి చేరింది. మరోవైపు వర్షాలు కొనసాగుతుండటంతో మరింత వరద జూరాలకు వచ్చి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు ఇలా కొనసాగితే మిగతా ఎత్తిపోతల పథకాల పరిధిలోని జలాశయాలకు నీటిని తోడేసే అవకాశం ఉంది.