జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రెండో రోజు తుంగభద్ర పుష్కరాలు ప్రశాంతంగా జరిగాయి. శనివారం 18వేల మంది భక్తులు నాలుగు ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజోళి, అలంపూర్ ఘాట్లకు భక్తలు తాకిడి కొనసాగుతుండగా.. పుల్లూరు, వేణి సోంపురం ఘాట్లలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నది స్నానాలకు అనుమతి లేకపోవటం.. అలంపూర్ శక్తిపీఠం కావటంతో ఎక్కువ మంది భక్తులు అక్కడికే వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్లకు వెళ్లే దారిలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి కొవిడ్ లక్షణాలు లేకపోతేనే ఆలయాలు, ఘాట్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఘాట్ల వద్ద మంచి నీళ్లు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి ఏర్పాట్లు చేశారు.
పంచహారతులు
పుష్కరాలకు భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో అత్యవసర వైద్యం అందించడం కోసం మోటర్‌సైకిల్ అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. వేలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం స్వచ్ఛంద ధార్మిక సంస్థలు ఉచిత అన్నదాన సత్రాలను నిర్వహిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంతో కొవిడ్ నిబంధనలకు లోబడి ఉచిత అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. సాయంత్రం తుంగభద్ర నదికి పురోహితులు పంచహారతులు ఇచ్చారు. నదీ హారతిని చూసి భక్తులు తరించారు.
నేడు ఆదివారం కావటంతో.. శనివారం కంటే అధికంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఐజీ స్టీఫెన్ రవింద్ర శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్, భక్తులు వచ్చిపోయే దారులలో పోలీసులు అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: కన్నుల పండుగగా తుంగభద్ర పుష్కర హారతి