జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న ధన్వాడకి చెందిన 'సుదర్శన్ - భాగ్యమ్మ'లకు ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడున్నారు. పెద్ద కుమార్తె సువార్తమ్మకు గతంలోనే పెళ్లిచేశారు. కుమారుడికి ఇంటర్ చదివేటప్పుడు వెన్నులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా... కీళ్లవ్యాధి సోకినట్లు వైద్యులు చెప్పారు. క్రమంగా అది కాళ్లు చేతులకు పాకటంతో నడవలేని స్థితికి చేరి, మంచానికి పరిమితమయ్యాడు. కుమారుడి పరిస్థితి ఇలా ఉండగానే.... అత్తారింట్లో ఉన్న కుమార్తెకు సైతం ఇదే సమస్య వచ్చింది. దీంతో భర్త వదిలేయగా సువార్త పుట్టింటికి చేరింది. ఇలా ఇద్దరు బిడ్డలు మంచానికే పరిమితమయ్యారు. కళ్ల ముందే చేతికొచ్చిన పిల్లలు జీవచ్ఛవాలుగా మారటంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది. వైద్యం కోసం కర్నూలు, హైదరాబాద్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది.ఆ వ్యాధి నయం కాదని జీవితాంతం మందులు వాడాలని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చి సేవలందిస్తున్నారు.
మా పిల్లలకు చాలా చోట్ల చూపించినాం సార్. కీళ్ల జబ్బు అంటుర్రు. ఇవీ దీర్ఘకాల వ్యాధి అంటున్నరు. ఇవీ బాగు అయ్యే సూచనలు లేవు అంటున్నరు. ఎంతసేపున్నా గోలీలు మింగాల్సిందే. ఒక్కొక్కరు రోజులు 100 రూపాయల గోలీలు మింగుతున్నరు. ఇప్పటికే 2 ఎకరాలు అమ్మి రూ.10 లక్షలు ఖర్చు చేసినా. మాకు చాలా బాధకరంగా ఉంది. నాకు చేతగాక ఇక బీపీ ఎక్కువైంది సార్. - సుదర్శన్, బాధితుల తండ్రి
రోజు నేనే అన్నం పెట్టాలా. బట్టలు ఉతికి అన్ని చేస్తున్నా సార్. స్నానాలు కూడా చేయిస్తున్నా. ఇప్పుడు ఇద్దరికి అన్నీ నేనే చేయాలా. మమ్మల్ని ప్రభుత్వమే ఏమన్నా ఆదుకుంటే బాగుంటుంది. - భాగ్యమ్మ, బాధితుల తల్లి
బిడ్డల వైద్యఖర్చుల కోసం సుదర్శన్-భాగ్యమ్మ అందినకాడల్లా అప్పులు చేశారు. ఈ క్రమంలోనే ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్మేశారు. ఎనిమిదేళ్లుగా ఇద్దరు పిల్లలు మంచానికే పరిమితం కాగా వారికి వృద్ధాప్యంలో చేరిన తల్లిదండ్రులే అన్నిరకాల సేవలు చేస్తున్నారు. చిన్నకుమార్తెలోనూ ఇదేతరహాలక్షణాలు బయటపడగా వైద్యులను సంప్రదించి, మందులు వేస్తున్నారు. కూలీ పనిచేసుకుంటే కానీ.. పూటగడవని స్థితిలో నెలకు బిడ్డల మందుల కోసం 15వేల వరకు ఖర్చవుతున్నట్లు బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. జీవచ్ఛవాలుగా మారిన తమ బిడ్డలు వృద్ధాప్యంలోకి చేరిన తమ గోడును దాతలు పట్టించుకుని అండగా నిలవాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆ కాలేజీలకు షాక్.. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు బంద్!