జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమబియ్యం దందా కాసులు కురిపిస్తోంది. రోజురోజుకూ పీడీఎస్ బియ్యంపై జరిగే అక్రమాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. వారంక్రితం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం 3 లారీల్లో అక్రమంగా తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుబడింది. గద్వాల జిల్లా మల్దకల్ మండలం బూడిదపాడు వద్ద పౌరసరఫరాలశాఖ అధికారులు ఆ వాహనాలను పట్టుకున్నారు. అనంతరం, ఐదురోజుల తర్వాత వారిపై 6ఎ కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ధాన్యం విలువ దాదాపు నాలుగున్నర కోట్లు ఉంటుంది. నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించినధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా మార్చి తిరిగి ఎఫ్సీఐ లేదా పౌరసరఫరాలశాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అలాంటి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం అనుమానాలకు తావిస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని 29 మిల్లులకు లక్షా 27వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద పౌరసరఫరాలశాఖ అప్పగించింది. ఆరు నెలలు గడుస్తున్నా మిలర్లు అప్పగించిన బియ్యం 23 శాతం మాత్రమే కాగా.. మిగిలిన ధాన్యం మిల్లర్ల వద్దే ఉండాలి. కానీ, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లారీలు పట్టుబడటంతో అసలు మిల్లుల్లో ధాన్యం ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరఆడించి ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తే.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎక్కన్నుంచి ఇస్తున్నారన్నది చర్చనీయంగా మారింది.
ప్రజాపంపిణీ బియ్యాన్ని ప్రజలనుంచే సేకరించి వాటినే సీఎంఆర్గా ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూపాయికి వచ్చే కిలో పీడీఎస్ బియ్యాన్ని 10రూపాయలకు కొనుగోలు చేసి వాటిని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలో ఏదోమూల నిత్యం అక్రమంగా తరలిస్తూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతోంది. అలాగే, బియ్యానికి బదులుగా కొన్నిరకాల నిత్యావసరాలు లబ్దిదారులకు అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ బియ్యం తినేందుకు ఇష్టపడని వారు.. అందుకు బదులుగా డీలర్లు ఇచ్చే నిత్యావసరాల్ని తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.రేవతి, పౌర సరఫరాల శాఖ అధికారి, గద్వాల జిల్లా
పట్టుబడినప్పుడల్లా 6ఎ కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పీడీ యాక్టు, క్రిమినల్ కేసుల జోలికి వెళ్లకపోవడంతో భయం లేకుండాపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జోగులాంబ గద్వాల జిల్లాలో సాగుతున్న అక్రమ బియ్యం దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: