కృష్ణానది నుంచి రాష్ట్రానికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి లక్షా 50వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుండగా.. అంతే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ జలాశయానికి లక్షా 60వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... లక్షా 43వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 37 టీఎంసీల సామర్థ్యానికి గానూ... 35 టీఎంసీలు నిల్వ ఉంచారు. జూరాల జలాశయానికి ఎగువ నుంచి లక్షా 40వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా... లక్షా 30వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుతం 1044 అడుగులమేర నీరుంది. 9 గేట్ల ద్వారా 90వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35వేల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి 2లక్షల 25వే క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 98వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా నమోదైంది. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 69వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 50వేల క్యూసెక్కులుగా ఉంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గానూ... 302 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. పులిచింతల జలాశయంలో సైతం 45 టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి : ఆటోలో వెళ్తుంటే హెల్మెట్ లేదట...