జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 16,192 ఎకరాల్లో కంది పంట సాగయ్యింది. గత నెల ఫిబ్రవరి 22 నుంచి ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 2039 మంది రైతుల నుంచి 17 వేల 900 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. 4818 రైతుల నుంచి 48,777 క్వింటాళ్ల కందులను కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేశారు.
మంచి రేటు అనుకున్నాం...కానీ
వర్షాలు సమృద్ధిగా కురిసి పంట దిగుబడి ఆశించిన మేర వచ్చింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు కందులు తీసుకువచ్చి కేంద్రాల వద్ద పడిగాపులు కాసి అమ్ముకున్నారు. ప్రభుత్వం మంచి రేటు ఇచ్చినా...ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. పంటను మంచి రేటుకు అమ్ముకున్నా...అధికారుల నిర్లక్ష్యంతో ఆ సంతోషం లేకుండా పోయిందని వాపోయారు. రుణదాతలు ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పులు తీర్చుకునే వాళ్లం...
డబ్బులు త్వరగా వచ్చి ఉంటే అప్పులన్నీ తీర్చుకునే వాళ్లమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకున్నారు కదా.. తీసుకున్న రుణాలు చెల్లించండంటూ రుణదాతలు ఇబ్బంది పెడుతున్నారాని వాపోయారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా డబ్బులు ఇప్పించాలని అధికారులను రైతులు కోరుతున్నారు.