జోగులాంబ గద్వాల జిల్లాలోని జమ్మి చెడులో కొలువైన జమ్ములమ్మ దేవతను అత్యంత మహిమాన్వితంగా కొలుస్తారు. 400 ఏళ్ల నాటి మాట, ప్రస్తుతమున్న జమ్ములమ్మ దేవస్థానం ఒకప్పుడు అటవీ ప్రాంతమని ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతుండగా గడ్డపార లోతుగా పోనందున బరువుగా ఒక రాయిని వెతికి తెచ్చి గడ్డపారపై రాయిని పెట్టుకుని పొలం దున్నేవాడు. తర్వాత ఆ రాయితో కూడిన గడ్డపార అక్కడే వదిలి ఇంటికి వెళ్లేవాడు. మరుసటి రోజు వచ్చి చూడగా రాయి లేదు.
మళ్లీ ఆ రాయి తెచ్చి పొలం దున్ని ఇంటికేళ్లేవాడు. రాయి మళ్లీ కనిపించేదికాదు. ఎవరో కావాలని తీస్తున్నారని... వారిని కనిపెట్టాలని ఒక రోజు రాత్రి పొలం దగ్గరే పడుకున్నాడు రైతు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో తెల్లటి దుస్తులతో దేవత రూపంలో ఆ రాయి దర్శనమిచ్చింది. అనంతరం యథా స్థానంలోకి వెళ్ళిపోయి మళ్లీ రాయిగా మారింది.
అప్పటి నుంచి అదే ఆనవాయితీ...
అమ్మ వారి రూపాన్ని చూసిన ఆ రైతు...తన జన్మ ధన్యమైందని సంతోషిస్తూ గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులూ.. మరుసటి రోజు రాత్రి అమ్మవారి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి పొలం దున్నేటప్పుడు అమ్మవారిని కొలిచి వ్యవసాయం చేయడం ఆనవాయితీగా మారింది. అప్పటి నుంచి నూతన గృహ ప్రవేశం, వివాహ మహోత్సవం ఏది చేసినా ముందుగా జమ్ములమ్మను దర్శించుకున్న తర్వాతే కార్యాలు జరుపుకుంటారు.
మేకలు, కోళ్లే నైవేద్యాలు...
జమ్ములమ్మను దర్శించుకునేందుకు గద్వాల అలంపూర్తో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. పౌర్ణమి రోజు మంగళవారం అమ్మవారిని పుట్టిల్లు గుర్రంగడ్డ నుంచి మెట్టినిల్లు... ఆలయానికి మేళతాళాలతో తీసుకొచ్చారు. అమ్మవారి దర్శనానికి, నైవేద్యం సమర్పించేందుకు మంగళవారం ఒక్క రోజే లక్ష మందిపైగా భక్తులు హాజరైనట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. నేటి నుంచి ఈనెల 19 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ సమీపంలో గుడారాలేసుకుని అమ్మవారికి మేకలు, కోళ్ళను కోసి నైవేద్యంగా సమర్పిస్తారు.
'స్నానాలకు ఇబ్బందులు'
జమ్ములమ్మ దేవతను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈఓ వీరేశం పేర్కొన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించామని వీరేశం తెలిపారు. అయితే స్నానాల కోసం ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పిల్లల కోసం మరబోటు లేకపోవడం వల్ల వారికి నిరాశే మిగిలింది.