ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కృషి ,పట్టుదలతో పాటు సరైన మార్గంలో నడిపించేందుకు మంచి శిక్షణ చాలా అవసరం. కానీ ప్రస్తుతం కోచింగ్ సెంటర్లు చాలా మందికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఇది గమనించిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో ఈ సమస్య ఉండకూడదని నిర్ణయించుకున్నారు. KCR స్టడీ సెంటర్ల పేరిట శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి....నిరుపేద నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన కోచింగ్ సెంటర్లలో...ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాలను దృష్టిలో పెట్టుకుని శిక్షణ ఇస్తున్నారు. సుమారు 1200 మంది నిరుద్యోగులకు...అత్యుత్తమ శిక్షణా నిపుణులతో విషయబోధన చేస్తున్నారు. గతంలో కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో ఇక్కడ శిక్షణ పొందిన 80 మంది ఉద్యోగాలు సాధించారు. తన జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేవారి సంఖ్య పెంచడమే తన లక్ష్యమని కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు.
దూరప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థులకు కేసీఆర్ స్డడీ సర్కిల్ వరంగా మారింది. ఎటువంటి లోటు లేకుండా ప్రైవేటు కోచింగ్ సెంటర్ల తరహాలోనే తమకు శిక్షణ అందిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. తమ గోడును అర్థం చేసుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకుని తప్పక ఉద్యోగం సాధిస్తామంటున్న నిరుద్యోగులు...భవిష్యత్‌లోనూ శిక్షణా కేంద్రాలు కొనసాగించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: రేపు ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు