కృష్ణా నదీ ప్రవాహం ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద పెరుగుతోంది. వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఆలమట్టి నుంచి మంగళవారం సాయంత్రం 2.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇది మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం అంచనా. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి జలాశయంలోకి 3.36 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. 39 గేట్ల ద్వారా 3.14 లక్షలు క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 19 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
వరద మరింత పెరిగే అవకాశం
రోజుకు దాదాపు 25 టీఎంసీల జలాలు జూరాల ప్రాజెక్టును దాటుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు జలాశయంలో నీటినిల్వను 8.81 టీఎంసీలకు తగ్గించారు. తుంగభద్రకూ వరద పెరుగుతోంది. దిగువకు 77 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం నాటికి 84 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీశైలానికి భారీ ప్రవాహం
కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ప్రవాహం చేరుతోంది. సోమవారం సాయంత్రం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రానికి 2.63 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 877.50 అడుగులు ఉంది. బుధవారం ఉదయానికి ప్రాజెక్టుకు వరద 3.24 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్