అప్పుడప్పుడూ వచ్చి ఎలా ఉన్నావు అని పలకరించే బంధువులు తప్ప... అక్కున చేర్చుకుని అన్నంపెట్టే నాథుడు లేని పండుటాకులు జీవిత చరమాంకంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పింఛన్ ఆదుకుంటుందని ఆశపడుతున్న వృద్ధులకు... అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. బతికున్న వారిని చనిపోయినట్లు ధ్రువీకరించి ఫించన్ల జాబిత నుంచి పేర్లను అధికారులు తొలగించారు. ఐదు నెలలుగా పింఛన్ రాక మలివయసులో వృద్ధులు పడుతున్న అగచాట్లను వారి నోటి వెంట వింటుంటే రాతి గుండెలైనా కరగకమానవు.
నా భర్త కాలంచేసి చానాళ్లయింది. గతేడాది వరకు వచ్చిన ఆసరా పింఛను ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఎవరిని అడిగినా మండల ఆఫీసుకు వెళ్లు అడుగు అని చెప్పేవారు. కదలలేని స్థితిలో అడుగుకు అడుగు బేర్చుకుంటూ అక్కడికి వెళితే.. నీవు చనిపోయావు అందుకే నీ పింఛను తీసేశామని అధికారులు చెప్పారు. నేను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలో తెలియట్లేదు.
- ఓ అవ్వ కన్నీటి మాటలు
ఆసరా పింఛన్లలో చనిపోయిన వారి పేర్లు తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గద్వాల జిల్లా వ్యాప్తంగా సుమారు 995 మంది పేర్లను కార్యదర్శులు గుర్తించారు. ఈ క్రమంలో కొందరు బతికున్న వారి పేర్లను మృతుల జాబితాలో చేర్చేశారు. ఫలితంగా అండగా ఉన్న ఆసరా... జారిపోయింది.
నేను బతికుండగా వస్తుందో లేదో...
పింఛను కోసం తెలిసిన వారిని తెలియని వారిని అడిగి అడిగి వేసాగిపోయాను. అక్కడ ఇక్కడ అని కాకుండా పింఛను కోసం ఎక్కడ రాస్తున్నారని తెలిసిన వెళ్లి కనిపించిన అధికారిని వేడుకున్నాను. అసలు నేను బతికుండగా పింఛను వస్తుందో రాదో అనిపిస్తోంది.
- ఓ వృద్ధురాలి దీనగాథ
కాళ్లరిగేలా తిరిగా...
అయిన వాళ్లు లేదు.. ఆదుకునే వారు కానరారు. ఆదుకుంటున్న ఆసరా.. అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆరిపోయే జీవితాలు ఆసరా కోసం ఆసగా ఎదురు చూస్తున్నాం.. పింఛను కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయేజనం లేదు.
-ఇంకో అవ్వ మాటల్లో
పింఛనురాక పూట గడవని పరిస్థితిలో ఆకలితో అలమటిస్తున్న పండుటాకులు... తమ గోడును వినిపించడానికి నడవలేని స్థితిలో కార్యాలయాల చుట్టూ తిరగలేక.... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని... లేని పక్షంలో చావే శరణ్యమని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇవీ చూడండి: కరోనా కలవర పెడుతోంది... భాగ్యనగరాన్ని వణికిస్తోంది!