Cotton pests in Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 78వేలు కాగా.. ఈ ఏడాది 2 లక్షల 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. అందులో 30 నుంచి 40 వేల ఎకరాలు "విత్తన పత్తి" కాగా.. మిగిలినది సాధారణ పత్తి. గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పత్తి వేశారు. ఇప్పటికే పంట చేతికి రావాల్సిన దశలో పూత, కాత లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయిజ మండలం ఈడిగోనిపల్లి, సంకాపురం, గద్వాల మండలం పూడూరు, అలంపూర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పూత, కాత లేకుండా ఏపుగా పెరిగిన పత్తి పంటను రైతులు పెరికి వేస్తున్నారు. ఎకరాకు 30 నుంచి 40వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సైతం ఆందోళన చేశారు.
పత్తి వేసినా పూత, కాత రాకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. కొందరు వ్యవసాయ అధికారులు వాతావరణ మార్పుల వల్ల పూత, కాత రాలేదని చెబుతున్నారని.. వాతావరణమే అందుకు కారణమైతే పక్కనే ఉన్న ఇతర చేలల్లో పూత, కాతతో ఎందుకు ఏపుగా పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. నాసిరకమైన విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆరోపిస్తున్నారు. విత్తన కంపెనీలపై చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అధిక వర్షాలు, వాతావరణ మార్పులు, చీడపీడలు కారణంగా పత్తిపంట పూత, కాత లేకుండా పోయిందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులు అందిన చోట శాస్త్రవేత్తలతో పంటను పరిశీలించి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ వెల్లడించారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి లోపం ఎక్కడ జరిగిందో నిగ్గుతేల్చాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: