దేశంలోనే అధిక విస్తీర్ణంలో విత్తనపత్తి సాగుచేసే నడిగడ్డ రైతులు.. ఈఏడాది పంట సాగుచేసేందుకు పెట్టుబడి సమస్య ఎదుర్కొంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా 45 వేలకు పైగా రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో విత్తనపత్తి సాగుచేస్తారు. విత్తన కంపెనీలకు, రైతులకు మధ్యవర్తులుగా ఉండే ఆర్గనైజర్లు.. కర్షకులకు ఫౌండేషన్ సీడ్ సహా అవసరాన్నిబట్టి రుణాలిస్తారు. కానీ ఈసారి పంట వేశాక.. పెట్టుబడి కోసం రుణాలివ్వడం లేదు. పెట్టుబడికి డబ్బులు లేక వేసిన పంటను రైతులు తొలగిస్తున్నారు. ముఖ్యంగా మల్దకల్ మండలంలోని మద్దెలబండ, అమరవాయి, ఎదులగూడెం, నాగర్ దొడ్డి, పెద్దొడ్డి తదితర గ్రామాల్లో కొందరు రైతులు వేసిన పంట తీసేశారు. పెట్టుబడుల కోసం రుణాలివ్వకపోతే.. పంటసాగు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
పత్తి పంటను మధ్యలోనే తొలగిస్తున్న రైతులు
జోగులాంబ జిల్లాలో విత్తనపత్తి సాగుచేసే రైతులు.. గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదు. ఫౌండేషన్ సీడ్ ఇచ్చిన ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు, వడ్డీపోను, మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంటసాగుచేశాక మధ్యలో అప్పులు ఇవ్వలేమని ఆర్గనైజర్లు చెప్పడంతో.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎకరా విత్తనపత్తి సాగుకు 2 నుంచి 3 లక్షలవరకు ఖర్చవుతాయి. ఇప్పటికే కొందరు పంట సాగుకు ఎకరాకు 50వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. డబ్బులు లేక పంటను పూర్తిగా నష్టపోయే బదులు.. ముందుగానే తీసేస్తే మేలని భావిస్తున్నారు. వేసినపంట తీయొద్దని తోటిరైతులు విజ్ఞప్తి చేస్తున్నా.. డబ్బులు లేనివారు వదులుకునేందుకే సిద్ధమవుతున్నారు.
కంపెనీలు ఇవ్వనందువల్లే రుణాలు ఇవ్వట్లేదన్న ఆర్గనైజర్లు
అప్పులివ్వకపోవడం వల్లే రైతులు పంటను తొలగిస్తున్నారన్న వార్తల్లో.. వాస్తవం లేదని ఆర్గనైజర్లు అంటున్నారు. విత్తనప్యాకెట్ల అమ్మకాలు సరిగా లేక.. కంపెనీలు డబ్బులు చెల్లించడం లేదని, అందువల్ల రుణాలివ్వడం ఆలస్యమవుతోందని వివరించారు. కంపెనీలు తమకు డబ్బులు చెల్లించిన వెంటనే పెట్టుబడి అందిస్తామని తెలిపారు.
విత్తనపత్తి సాగులో మొగ్గల క్రాసింగ్ జరిగే ఆగస్టు నెలనే కీలకం. ఈ నెలలో పెట్టుబడులు అందకపోతే రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. విత్తనపత్తి సాగుచేసే రైతులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లేదు. ఎకరాకు లక్షా 20 వేలు ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం భావించినా, అమలుకు నోచుకోలేదు.
ఇదీ చూడండి: