రాష్ట్రంలో రెండు వేర్వేరు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు కలకలం సృష్టించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ రైతు తన సమస్యను అధికారులు పరిష్కరించడం లేదనే మనస్తాపంతో కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన లోకేశ్‌కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. దానిని పక్క పొలం వాళ్లు అక్రమించుకున్నారు. దీనిపై పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
ఆ విషయంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన లోకేశ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.
భూమికి పట్టా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. యువతి సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబంతో సహా ప్రజావాణికి తరలివచ్చిన యువతి పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలంటూ నినదించారు. దీంతో అక్కడ ఉన్న కలెక్టరేట్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి అదనపు కలెక్టర్ మోహన్‌రావు చొరవచూపారు. వెంటనే ఆయన గరిడేపల్లి తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు.
కలెక్టర్, అదనపు కలెక్టర్ సమస్య పరిష్కరిస్తామన్న హామీతో యువతి ఆందోళన విరమించింది. గరిడేపల్లి మండలం కల్మచెర్వు గ్రామంలో తమకు 34 గుంటల భూమి ఉందని బాధితురాలు తెలిపింది. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందిన మీసాల సైదులుతో కొంతకాలంగా వివాదం కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో మీసాల సైదులు తమపై దాడి చేసి భూమిని ఆక్రమించాడని చెప్పింది. ఇదే విషయంమై పోలీసులు తమను వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. సమస్యను పరిష్కరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. హైదరాబాద్‌లో మరోసారి సోదాలు
స్నేహితుడితో గుడికి వెళ్లిన మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ప్రియురాల్ని హత్యచేసి పెరట్లోనే