జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో జిల్లా పాలనాధికారి శృతి ఓజా సమావేశం నిర్వహించారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితోనే నిత్యావసర సరకులను పంపిణీ చేయించనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజులకు సరిపడా నిత్యావసర సరకులను ఒక ప్యాకెట్‌గా ఇంటింటికీ అందించాలన్నారు. పాలను మాత్రం ప్రతీ రోజూ అందించాలని, ఇందుకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు.
క్వారంటైన్‌లో ఉన్న నెగటివ్ వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ వినియోగించిన మాస్కులు, గ్లౌజులు వంటి వ్యర్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అప్పగించి నాశనం చేయించాలన్నారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 గదిలో పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ అందించగలిగే సౌకర్యం ఉండాలన్నారు.