జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతిచెందిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పించి.. అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని ఆదేశించారు. ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించాలని సూచించారు.
మంత్రి స్పందన
కొత్తపల్లి ఘటన దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గోడకూలి ఐదుగురు మరణించిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో బలహీనంగా, ప్రమాదకరంగా ఉన్న గృహాలు, పరిసరాలను గుర్తించి... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. భారీ వర్షాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు.
ఇదీ జరిగింది..
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మోషా,శాంతమ్మ, చరణ్, రాము, తేజగా గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. వర్షానికే ఇంటి గోడ కూలిందని చెబుతున్నారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతులను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వర్షాలు కురిసేటప్పుడు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: వర్షానికి కూలి ఇంటిగోడ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మరో ఇద్దరు...